చెమికల రాజశేఖర రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ అండ్ చెస్ పేరెంట్ (9505555382)
భారతదేశ చదరంగంలో ఎక్కడో లోపముంది. నాణ్యమైన వనరులు, కోచింగ్ అందరికీ అందుబాటులోకి రావడం లేదు. అదృష్టవంతులు కొందరే అన్ని విధాలా ముందుకుపోతున్నారు. ఈ పరుగు పందెంలో వెనకబడిన వారు ఎంత ప్రతిభ వున్నా సరే ముందుకు పోలేక మధ్యలోనే ఆగిపోయి ఆఖరికి చదరంగానికి గుడ్ బై చెబుతున్నారు. ఎందుకిలా? ఏం చేయాలి? 2013లో ఓ యువకున్ని వెంటాడిన ప్రశ్నలివి. ఇంటర్నెట్ విస్తరించిన తర్వాత, అనేక చెస్ ఇంజిన్లు, సాప్ట్ వేర్లు, సీడీలు, ప్రీమియమ్ మెంబర్ షిప్పులు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటినన్నిటినీ భారతదేశంలోని మధ్యతరగతివారికి, దిగువ మధ్యతరగతివారికి అందుబాటులోకి తేవడానికి ఇంటర్నేషనల్ మాస్టర్ రంగంలోకి దిగారు. అతనే ముంబాయికి చెందిన సాగర్ షా.
మన దేశంలో ఐఎం అయిన మొట్టమొదటి ఛార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ఆయనే. ప్రస్తుతం రెండు జీఎం నార్మ్‌లను కలిగి వున్నారు. మరో నార్మ్ సంపాదించుకొని, 2500 రేటింగును చేరుకోగానే జీఎం అవుతారు. ప్రస్తుత FIDE Elo 2407.
చదరంగానికి సంబంధించిన టెక్నాలజీని దేశమంతా అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్న సాగర్ షా…మొదట చెస్ బేస్ ఇంటర్నేషనల్ (జర్మనీలోని హాంబర్గ్‌లో వుంది)వారిని కలిసి ఒప్పించి వారి సహకారంతో చెస్ బేస్ ఇండియా స్థాపించారు. దాంతో ఇతర పోటీ ఇంటర్నేషనల్ వెబ్ సైట్లలో కదలిక వచ్చింది. అంతకు ముందు ఇంటర్ నెట్ బ్లాగుద్వారా వందలాది చెస్ రిపోర్టులు రాసి శాయశక్తులా చదరంగ వ్యాప్తికి కృషి చేసిన ఆయన..చెస్ బేస్ ఇండియా ప్రారంభించిన తర్వాత తన టీమ్ సాయంతో అద్భుతమైన విశ్లేషణలు, ఇంటర్వ్యూలతో భారతీయ క్రీడాకారులెందరినో ప్రపంచానికి చాలా విపులంగా పరిచయం చేస్తున్నారు.
ఈ దేశంలో ఎక్కడ వినూత్న ప్రయత్నం జరిగినా దాన్ని సాగర్ షా, ఆయన బృంద సభ్యులు కవర్ చేస్తున్నారు. అరటిపండు వలిచినట్టుగా సులువైన పదాలతో వివరిస్తూ చెస్ పాఠకులను ఆకట్టుకుంటున్నారు. మన సింప్లీ చెస్ ఫౌండేషన్ నిర్వహించిన స్ట్రీట్ చెస్, సూపర్ కిడ్స్ వారి ఎనీటైమ్ చెస్ కాన్ సెప్టులను చెస్ బేస్ ఇండియాలో కవర్ చేశారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ సిఆర్‌జి కృష్ణ, హర్ష భరత్ కోటిలాంటివారి ప్రతిభను సందర్భం వచ్చినప్పుడల్లా వివరించారు. నిత్యం అనేక గేములకు సంబంధించిన అర్థవంతమైన విశ్లేషణల్ని అటు వీడియాలద్వారా, ఇటు వ్యాసాల ద్వారా అందిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే చదరంగాన్ని బలోపేతం చేయడంలో, విస్తరించడంలో, ఈ రంగంలో స్పష్టత తేవడంలో సాగర్ షా దంపతులు చేస్తున్నంత కృషిని ప్రస్తుతం మన దేశంలో ఎవరూ చేయడం లేదు. ఇది నా పరిశీలన. లెజండరీ ప్లేయర్ విశ్వనాధ్ ఆనంద్ కారణంగా మన దేశంలో చెస్ …పండితులనే కాదు, పామరులను కూడా చేరుకుంది. అయితే ఈ రంగంలోకి వచ్చిన వారికి క్లారిటీ ఇవ్వడంలో మాత్రం అటు ప్రభుత్వాలుగానీ, ఇటు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ లాంటి సంస్థలు గానీ పెద్దగా ఏమీ చేయడం లేదు. కానీ ఐఎం సాగర్ షా దంపతులు మాత్రం గత నాలుగైదు సంవత్సరాలుగా నిర్విరామంగా అనేక నాణ్యమైన, విలువైన రిపోర్టులు అందిస్తూ క్లారిటీ ఇస్తున్నారు. ఇది ప్రశంసనీయమైన కృషి. కేవలం చెస్ పిచ్చి వున్న వారు మాత్రమే ఈ పని చేయగలరు.
సాగర్ షాకు చెస్ అంటే మహా పిచ్చి అనడానికి ఆయన వివాహమే నిదర్శనం. పెళ్లిని పూర్తిగా చదరంగంతో నింపారు. దీని గురించి నేను చెప్పడంకంటే ఈ లింకుద్వారా ఆయన బ్లాగును చేరుకొని మీరే చూడండి. http://sagarteacheschess.blogspot.in/…/a-chess-themed-india…. తన పెళ్లిలో పసందైన విందు భోజనమే కాదు… టీమ్ టోర్నమెంట్ నిర్వహించారు. సాగర్ షా సతీమణి అమృతా మోకల్ కూడా పేరున్న చెస్ ప్లేయర్, చెస్ ఫోటోగ్రాఫర్. ఆమె ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఎలక్ట్. నాలుగు ఐఎం నార్మ్స్ సాధించారు. ఆమె సోదరుడు ప్రథమేష్ మోకల్ కూడా ఇంటర్నేషనల్ మాస్టరే . దాంతో సాగర్ షా అండ్ అమృత మోకల్ వివాహానికి వచ్చినవారిలో అనేక మంది ప్రసిద్ధి చెందిన ఆటగాళ్లుండడం ఆశ్చర్యమేమీ కాదు.వారందరినీ కలిపి టీమ్ టోర్నమెంటు నిర్వహించి..ఇతర ఆహ్వానితులను ఆకట్టుకున్నారు.
చెస్ లో సీరియస్‌గా మునిగి తేలుతున్న అనేక మందికి సాగర్ షా దంపతుల గురించి బాగా తెలుసు. ప్రస్తుతం వారు తమ అద్దె ఇంటిని ఖాళీ చేసి ప్రపంచమంతా తిరుగుతున్నారు. ముఖ్యమైన టోర్నమెంట్లను కవర్ చేస్తూ చెస్ అప్ డేట్స్‌ను చాలా విపులంగా అందజేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పలాంటే నొమాడిక్ లైఫ్ (సంచార జాతి తెగల జీవనం) లాంటిది. సంచార జాతి తెగలకు తమకంటూ సొంత ఇళ్లు వుండదు. తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని తమకు నచ్చిన ప్రాంతంలో కొంతకాలం జీవించి మరో ప్రాంతానికి వెళ్లిపోతుంటారు. అలాగా సాగర్ షా దంపతులు కూడా తమ అద్దె ఇంటిని ఖాళీ చేసి వస్తువులన్నిటినీ రెంటెడ్ స్టోర్ హౌస్ లో వుంచి ప్రపంచపర్యటనలో పడిపోయారు. ఈ పనిని వారు ఒక సంవత్సరంపాటు చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు ఈ నెల 27, 28 తేదీలలో హైదరాబాద్ వస్తున్నారు. జార్ చెస్ అకాడమీ (కాంటాక్ట్ నెంబర్లు..7729006688, 7729660088) ఆధ్వర్యంలో రెండు రోజుల క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇందులో రెండు అంశాలు ప్రధానంగా వుంటున్నాయి. బ్లైండ్ ఫోల్డ్ ట్రెయినింగ్ ద్వారా విజువలైజేషన్, కాలిక్యుల్యేషన్ పవర్ పెంచుకోవడం మొదటి అంశం. ఇక రెండోది టెక్నలాజికల్ పార్ట్. లేటెస్ట్ సాప్ట్‌వేర్ ల ద్వారా చెస్ ప్రిపరేషన్‌కు సంబంధించినది.
నాకు తెలిసి మన హైదరాబాద్‌లో గత మూడు సంవత్సరాలుగా చెస్ క్యాంపులు నిర్వహిస్తున్నది జార్ చెస్ అకాడమీనే. ప్లేయర్లకు సంబంధించి ఎవరికివారికి రెగ్యులర్‌కోచింగు వున్నా సరే క్యాంపులవల్ల జరిగే మేలు ప్రత్యేకంగానే వుంటుంది. ఇక రెగ్యులర్ కోచింగ్ లేనివారికైతే వీటి వల్ల జరిగే మేలు మరింత ఎక్కువగా వుంటుంది. సూపర్ గ్రాండ్ మాస్టర్ మిహాయిల్ మారిన్, గ్రాండ్ మాస్టర్ విష్ణు ప్రసన్న, ఐఎం పిడిఎస్ గిరినాధ్, ఐఎం ఎలక్ట్ రాకేష్ కులకర్ణిలాంటివారితో ఇంతవరకూ పలు క్యాంపులు నిర్వహించారు. ఇటీవల ఐఎం సాగర్ షా దంపతులతో రెండు రోజుల క్యాంప్ (ఫిబ్రవరి నెల 27, 28 తేదీలలో) ఏర్పాటు చేశారు. చెన్నై, ముంబయి, ఢిల్లీ, కలకత్తా నగరాల్లోలాగానే మన హైదరాబాద్‌లో కూడా రెగ్యులర్‌గా క్యాంపులు జరిగితే అవి స్థానిక క్రీడాకారులకే కాదు, లోకల్ కోచులకు కూడా ఉపయోగపడతాయి. ఒక చిన్న కోచ్ తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకొని తన పరిధిని విస్తరించుకోవాలనుకుంటే, ఇలాంటి క్యాంపులు తప్పకుండా మేలు చేస్తాయి. తెలంగాణ స్టేట్ చెస్ అసోషియేషన్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధి చెందిన కోచింగ్ సెంటర్లు, సింప్లీ చెస్ ఫౌండేషన్, ఎనీటైమ్‌చెస్(ఏటీసీ) లాంటి సంస్థలు లోకల్ టోర్నమెంట్లతోపాటు, జీఎం/ఐఎం క్యాంపులను ఎకనమికల్ ఫీజులతో నిర్వహిస్తే మన ప్లేయర్లకు ఎంతో మేలు చేసినవారవుతారు.
క్యాంపులను ఆదరించడంలో చెస్ పేరెంట్స్ వైఖరిలో కూడా మార్పు రావాలి. కొంతమంది ఏదో ఒక కారణంగా క్యాంపులకు దూరం కావడం జరుగుతోంది. ఫీజు ఎక్కువనిపిస్తే నేరుగా నిర్వాహకులను సంప్రదించి ఫీజులో మినహాయింపు కోరవచ్చు. లేదా క్యాంపునుంచి తాము ఏమి ఆశిస్తున్నది నిర్వాహకులకు నేరుగా తెలియజేయవచ్చు. అలాగే నిర్వాహకులు కూడా ప్లెక్సిబుల్ గా వ్యవహరించి జిల్లాలనుంచి వచ్చే టాలెంట్‌ను ప్రోత్సహించాలి. మంచి చెస్ ఎడ్యుకేషన్, మంచి ప్రాక్టీస్..ఈ రెండూ తోడయితే చెస్‌లో ప్రతిభ వున్న క్రీడాకారులు తప్పకుండా తమ లక్ష్యాలను చేరుకుంటారు.